యుపిఎ మనుగడ కష్టం: వెంకయ్య
హైదరాబాద్: సమాజ్ వాదీ పార్టీ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం మనుగడ కష్టమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కొనవూపిరితో కొట్టుమిట్టాడుతుందని, ఎస్పీ మద్దతు వెంటిలేటర్ మీద శ్వాసను అందిస్తుందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం యుపిఎకు మద్దతు ఇస్తున్న ఎస్పీ తమ పార్టీని సాకుగా చూపడం సరి కాదని ఆయన అన్నారు.
ఎస్పీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. తమ పార్టీ నేత అద్వానీని విమర్శించే హక్కు ఎస్పీకి లేదని ఆయన అన్నారు. ఎవరు కాదన్నా వచ్చే ఎన్నికల ద్వారా అద్వానీ ప్రధాని కావడం ఖాయమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాస తీర్మానం పెట్టకపోతే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంపై తాము ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ లోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications