9 గంటలిస్తామనలేదు: షబ్బీర్
హైదరాబాద్: రైతులకు తాము రోజుకు 9 గంటల విద్యుత్తు ఇస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వలేదని విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. రైతులకు రోజుకు 9 గంటల విద్యుత్తు ఇస్తామని తాము హామీ ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విమర్శల్లో నిజం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తమ పార్టీ ఎన్నికల ప్రణాళికను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపుతానని, అలాంటి హామీ ఉంటే నిరూపించాలని ఆయన అన్నారు.
తాము వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ మేరకు రోజుకు 7 గంటలు ఉచితంగా ఇస్తున్నామని ఆయన చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రోజుకు ఏడు గంటలే వ్యవసాయానికి విద్యుత్తును ఇచ్చిందని, అదే పద్ధతిలో తాము విద్యుచ్ఛక్తిని అందిస్తున్నామని, అయితే హామీ మేరకు ఆ విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నామని ఆయన అన్నారు. పార్టీలోని అంతర్గ సంక్షోభాన్నికప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications