'టీ' అధ్యక్షుడు విఠల్ రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీ) అధ్యక్షుడు సి. విఠల్ తన ఉద్యోగానికి, పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పారు. విఠల్ విద్యాశాఖలో సీనియర్ ఆడిటర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ అయిన 610 జీవో అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఆయన రాజీనామా చేశారు.
ప్రభుత్వం 610 జీవో అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఈ జీవో అమలు ద్వారా 6గురు తెలంగాణవారికి కూడా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందని ఆయన అన్నారు. ఆంధ్ర పాలకులు బ్రిటిష్ పాలకుల కన్నా ఘోరంగా తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు ఎడతెగని అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications