నోట్లకు ఓటుపై యుపిఎ మిత్రుల సిడి
న్యూఢిల్లీ: నోట్లకు ఓటు కుంభకోణంలో మరో సిడి కథనం వెలుగు చూసింది. నోట్లకు ఓటు కుంభకోణం వ్యవహారాన్ని బిజెపి కట్టుకథగా తెలియజేయడానికి ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) మిత్రులు సోమవారంనాడు ఈ సిడిని విడుదల చేశారు. బిజెపి నాయకుల చెబుతున్నవన్నీ అబద్ధాలని తేలిపోయిందని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్, లోక్ జనశక్తి నేత రాంవిలాస్ పాశ్వాన్ లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ములాయం సింగ్ ఆ సిడిని విడుదల చేశారు.
డబ్బులు ఇవ్వడానికి బిజెపి పార్లమెంటు సభ్యుడి ఇంటికి వెళ్లినవారిని అప్పుడే ఎందుకు పోలీసులకు అప్పగించలేదని, ఫింగర్ ప్రింట్ పరీక్షలు కొన్ని సాక్ష్యాలను నిరూపించి ఉండేవని ములాయం సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రం చేయడానికి బిజెపి కట్టుకథ అల్లిందని ఆయన విమర్శించారు. ఈ తాజా సిడితో నోట్లకు ఓటు కుంభకోణంలో విడుదలైన సిడిల సంఖ్య మూడుకు పెరిగింది. ఈ డ్రామానంతా బిజెపి అల్లిందని పాశ్వాన్ విమర్శించారు.












Click it and Unblock the Notifications