11న ముషార్రఫ్ పై అభిశంసన
ఇస్లామాబాద్: అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ను అభిశంసించే విషయంపై పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వంలోని రెండు ప్రధాన భాగస్వామ్య పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. నిరుడు ఉద్వాసనకు గురైన న్యాయమూర్తులను తిరిగి నియమించే విషయంపై కూడా ఈ పార్టీలకు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముషార్రఫ్ పై అభిశంసనకు సంబంధించి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పిఎంఎల్ - ఎన్ ప్రకటన ముసాయిదాను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డాన్ పత్రిక రాసింది.
ముషార్రఫ్ పై అభిశంసన మీద, న్యాయమూర్తులను తిరిగి నియమించే విషయం మీద పిపిపి నాయకుడు రజా రబ్బానీ ఛేంబర్ లో ప్రకటనకు తుది రూపు ఇచ్చినట్లు సమాచారం. ముషార్రఫ్ ను అభిశంసిస్తూ ఆగస్టు 11వ తేదీన పార్లమెంటులో తీర్మానాన్ని ప్రతిపాదించే అవకాశం ఉందని మంత్రివర్గ సభ్యుడొకరు చెప్పారు. నేషనల్ అసెంబ్లీ, నాలుగు ప్రొవిన్షియల్ అసెంబ్లీల ప్రత్యేక సమావేశాలు అదే రోజు ప్రారంభమవుతాయి. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముషార్రఫ్ చైనాకు వెళ్లాల్సింది. అయితే గురువారం తన ప్రయాణంలో ఆయన ఆలస్యం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications