స్థానిక సంస్థలపై దద్ధరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్: స్థానిక సంస్థలకు నిధుల బదలాయింపుపై మంగళవారం శాసనసభ దద్ధరిల్లింది. ప్రతిపక్ష తెలుగుదేశం, అధికార కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. స్థానిక సంస్థలకు నిధుల బదలాయింపుపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో తొలుత శాసనసభ పది నిమిషాల పాటు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత సభ సద్దుమణగలేదు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్ నిర్ణయాలను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని తెలుగుదేశం సభ్యులు వ్యాఖ్యానించారు. తమకు నిరసన తెలియజేసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థలపై ప్రతిపక్షాలు కపటప్రేమను ప్రదర్శిస్తున్నాయని ప్రభుత్వం విమర్శించింది. ఈ సందర్భంగా స్పీకరుపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రస్తావనకు వచ్చింది. తీర్మానాన్ని తిరస్కరించే హక్కు స్పీకరుకు ఉందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ సమయంలో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి జోక్యం చేసుకుని అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించే ప్రసక్తి లేదని, దాన్ని చర్చకు తీసుకుంటామని చెప్పారు. స్థానిక సంస్థలపై ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణకు కూడా ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు.
జివో 13 ద్వారా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శించారు. స్థానిక సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఎం,సిపిఐ, బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications