తెరాసతో పొత్తు ఆలోచనే తప్పు: ఎస్వీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుంటే సిగ్గు చేటు చర్యే అవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్వీ సుబ్బారెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఎంత సిగ్గులేకుండా వ్యవహరిస్తారని అనుకున్నా తెరాసతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెరాసతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనే తప్పు అని ఆయన అన్నారు. ఒకప్పుడు తెరాస అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవారేనని, బయటకు వెళ్లాక తెలుగుదేశం పార్టీ నాయకులను నానా మాటలు అన్నారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకంటే కోస్తా, రాయలసీమల్లో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చారు. రాష్ట్ర రాజధాని అనే ఉద్దేశంతో ఆ రెండు ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టారని, ప్రత్యేక తెలంగాణ అంటే వారు అసంతృప్తికి గురవుతారని, ఆ రెండు ప్రాంతాల ప్రజలు సమైక్య రాష్ట్రాన్నేకోరుకుంటున్నారని ఆయన అన్నారు. తాను సమైక్యవాదనని ఆయన చెప్పారు. అభిప్రాయం కోసం కోర్ కమిటీ నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని ఆయన చెప్పారు. రాయలసీమలో చిరంజీవి ప్రభావం అంతగా ఉండదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications