ఎమ్మెల్సీలతో టిడిపి కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ అభిప్రాయ సేకరణను ప్రారంభించింది. మంగళవారం మధ్యాహ్నం కోర్ కమిటీ సభ్యులు పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమైంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్సీలందరూ హాజరయ్యారు. రేపు వినాయకచవితి కావడంతో కమిటీ సమావేశం కావడం లేదు. ఈ నెల 4,5,6 తేదీల్లో కమిటీ సమావేశమై శాసనసభ్యుల, పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల, ఇతర ముఖ్యనేతల అభిప్రాయాలు తెలుసుకుంటుంది.
తమ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకోవాలా, వద్దా అనే అంశంపై కూడా కోర్ కమిటీ అభిప్రాయాలు సేకరిస్తుంది. అయితే పొత్తులపై అభిప్రాయ సేకరణ లేదని కమిటీ సభ్యుల్లో ఒక్కరైన యనమల రామకృష్ణుడు చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇతర ప్రాంతాల్లో దాని ప్రభావం ఎలా ఉంటుందనే అనే అంశాలపై కూడా కమిటీ అభిప్రాయాలు సేకరిస్తుంది.
వివిధ స్థాయిల్లో అభిప్రాయాలను సేకరించి పార్టీకి కమిటీ నివేదికను సమర్పిస్తుంది. కమిటీ తన నిర్ణయాలను వెల్లడించదు. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ నిర్ణయం తీసుకుని వెల్లడిస్తుంది. మంగళవారం జరిగిన సమావేశానికి కమిటీ సభ్యుల్లో ఒక్కరైన కె.ఇ. కృష్ణమూర్తి రాలేదు. మోకాలికి శస్త్రచికిత్స జరిగిన కారణంగా ఆయన సమావేశానికి హాజరు కాలేకపోయారు. అవసరమైతే కమిటీ మరో రెండు మూడు సార్లు సమావేశవమవుతుందని యనమల రామకృష్ణుడు చెప్పారు.












Click it and Unblock the Notifications