పునరాలోచనలో ఇన్ఫోసిస్
బెంగుళూర్: నానో కార్ల ప్రాజెక్టు స్థాపన విషయంలో టాటా మోటార్స్ ఎదుర్కుంటున్న సమస్యలతో పశ్చిమ బెంగాల్ లో పెట్టుబడులు పెట్టే విషయంపై ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ పునరాలోచనలో పడింది. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకునే విషయంలో అనుసరిస్తున్న పద్ధతిని తాము పరిశీలిస్తున్నామని, వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నామని ఇన్ఫోసిస్ మానవ వనరుల విభాగం డెరైక్టర్ టివి మోహన్ దాస్ పాయ్ అంటున్నారు. ఇన్ఫోసిస్ కోల్ కత్తా శివారులో 250 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి కేంద్రాని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంది. ఇందులో 5 వేల మందికి పైగా ఉపాధి లభిస్తుంది. అయితే సింగూరులో టాటా మోటార్స్ కు ఎదరవుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుని ఇన్ఫోసిస్ పునరాలోచనలో పడింది.
సింగూరు వివాదంతో తాము పునరాలోచనలో పడ్డామని పాయ్ చెప్పారు. ప్రముఖ వ్యాపారవేత్తలను రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కార్పోరేట్ కంపెనీలను భయాందోళనలకు గురి చేస్తున్నారని, ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. హైకోర్టు ఆదేశాలు కూడా అమలు కావడం లేదని, దీంతో పెట్టుబడిదారుల మనస్సుల్లో ఆక్షేపణ మొదలైందని, భారతదేశంలో ఎన్నో ప్రాంతాలున్నాయని ఆయన అన్నారు. అయితే తాము అధికారికంగా విరమించుకోవడం లేదని, ప్రభుత్వం తమ ఉద్యోగులకు రక్షణ కల్పిస్తుందా, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కాపాడుతుందా అనే విషయాలను నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. వంద ఏళ్ల టాటా మోటర్స్ కే ఇబ్బందులు ఎదరువుతుంటే ఇతర పెట్టుబడిదారుల పరిస్థితేమిటని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications