స్పీకరుపై అవిశ్వాసం: చర్చ ప్రారంభం
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సోమవారం చర్చ ప్రారంభమైంది. శాసనసభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం ఇదే ప్రథమం. చర్చ సందర్భంగా సురేష్ రెడ్డి సభకు రాలేదు. డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ సభకు అధ్యక్షత వహించారు. చర్చకు రెండు గంటల సమయం కేటాయించారు. అయితే చర్చకు సమయం కేటాయింపుపై తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి 25 నిమిషాలు మాత్రమే కేటాయించారు. అయితే తమకు గంట సమయం కావాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టారు. అయితే డిప్యూటీ స్పీకర్ అందుకు అనుమతించలేదు. ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి చర్చను ప్రారంభించారు.
కాంగ్రెసుకు 40 నిమిషాలు, సిపిఎంకు 8 నిమిషాలు ,జనతా, ఎస్పీ, బిఎస్పీలకు నాలుగేసి నిమిషాలు, సిపిఐ, బిజెపిలకు ఐదేసి నిమిషాలు ,స్వతంత్రులకు నాలుగు నిమిషాలు కేటాయించారు. అవిశ్వాస తీర్మానానికి 53 మంది సభ్యులు మద్దతు ఉన్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినవారికంటే ఇతరులకు ఎక్కువ సమయం ఇవ్వడాన్ని తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం తెలియజేశారు. స్పీకరుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది.












Click it and Unblock the Notifications