స్పీకర్ వైఖరిపై తెరాస ధ్వజం
హైదరాబాద్: తెరాస పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు తమ స్వార్థ ప్రయోజనాలకోసం పార్టీ ఫిరాయించారని వారిపై ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలని తాము నోటీసు ఇచ్చామని, ఇది జరిగి రెండేళ్లు అయినా ఇంతవరకు చర్య తీసుకోకపోవటం దుర్మార్గమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. దీంతో ప్రభుత్వ విప్ కిరణ్‌కుమార్‌రెడ్డి లేచి ఈ కేసులో స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు సైతం తీర్పు ఇచ్చిందని, అయినా ఇప్పుడు తిరిగి ఆ విషయం సభలో చర్చించటం కోర్టును ధిక్కరించటమేనని అన్నారు. దానిపై చర్చించడం స్పీకర్ న్యాయపరమైన హక్కులను ప్రశ్నించడమే అవుతుందని ఆయన అన్నారు. తాము స్పీకరుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిందే ఆ అంశంపైన అని, అందువల్ల తాము దానిపై మాట్లాడుతామని రాజేందర్ అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు లేచి నిర్ణయం తీసుకోవటం అంటే రెండేళ్లు అయితే ఎలాగని అన్నారు. తెరాస సభ్యులకు దీనిపై మాట్లాడే హక్కు ఉందన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి లేచి ఎన్టీఆర్ హయాంలో ఆయన తన పార్టీనుంచి బాబువైపు ఫిరాయించిన వారిపై చర్యకు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకోనివారు ఇప్పుడు ఎలా వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఈలోగా డిప్యుటీ స్పీకర్ రాజేందర్‌ను తిరిగి మాట్లాడాలని కోరారు. స్పీకర్ చర్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తమ పార్టీని దెబ్బ తీయడానికి ప్రభుత్వం కుట్ర చేసిందని, అందువల్లనే విఫ్ ను ధిక్కరించిన తమ సభ్యులపై స్పీకర్ చర్య తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. లోకసభ స్పీకర్ ఇటువంటి వ్యవహారాల్లో అతి త్వరగా చర్యలు తీసున్న ఉదంతాలను ఆయన గుర్తు చేశారు.
అధికారపక్షం నుంచి వస్తున్న సూచనలు, సలహాలు, ఒత్తిళ్లే స్పీకర్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడానికి కారణమని సీపీఎం శాసనసభ్యుడు నోముల నర్సింహ్మయ్య అన్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం గురించి జరిగిన చర్చలో నర్సింహ్మయ్య ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. చర్చల మధ్యలో అనవసరమైన విషయాలు తీసుకువచ్చి సభా సమయాన్ని ఎన్నోసార్లు వృథా చేశారని మండిపడ్డారు. సభలో చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయినప్పుడు సభలో చర్చించని అంశాలెన్నింటినో అంగీకరించినట్లుగా స్పీకర్ తీర్మానం ఇస్తున్నారని నోముల అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సభా కమిటీలను నియమించినా, వాటి గురించి స్పీకర్ పట్టించుకోలేదని ఆయన ఆక్షేపించారు. స్పీకర్‌పై గౌరవం ఉన్నప్పటికీ, అధికారపక్షం వైపు నుంచి వస్తున్న సైగలు, సూచనలను పాటించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి కారకులైనందుకు ప్రభుత్వం బాధపడాల్సిందిపోయి, సమర్థించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్, టిడిపిల తప్పులు కలిస్తే ఒక ఒప్పు కాదన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు.












Click it and Unblock the Notifications