తెరాస ఆందోళన: అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్: తమ పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణరెడ్డికి మాట్లాడేందుకు సభాధ్యక్ష స్థానంలో ఉన్న కుతూహలమ్మ అవకాశం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా సోమవారం శాసనసభలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏ హోదాలో మందాడికి మాట్లాడేందుకు అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తూ తెరాస సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఈ గందరగోళంలోనే శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య జోక్యం చేసుకుని - స్పీకర్ అనుమతించిన తర్వాత ఏ సభ్యుడికైనా మాట్లాడేందుకు హక్కు ఉంటుందని అన్నారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తమ పార్టీకి చెందిన 9 మంది సభ్యులపై నిర్ణయం తీసుకోనందుకు నిరసనగా తెరాస స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. గొడవ జరుగుతుండగానే ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి లేచి - తాను కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతున్నానని, వాటిని వినడానికి ధైర్యం ఉండాలని అన్నారు. స్పీకర్ హోదాను దిగజార్చేందుకు మాత్రమే తెరాస సభ్యులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. నిరసన తెలియజేస్తూ తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్దనే నించున్నారు.
ఈ సమయంలో తెలుగుదేశం సభ్యుడు యనమల రామకృష్ణుడికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. సీట్లలోకి వెళ్లాలని డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ చేసిన సూచనను తెరాస సభ్యులు పట్టించుకోలేదు. తెరాస గుర్తుపై వారు గెలిచారు కాబట్టి తెరాస అసమ్మతి సభ్యులను తెరాస సభ్యులుగానే గుర్తిస్తున్నారని, అందువల్ల తమ పార్టీ తరఫున మాట్లాడేవారి జాబితాను ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఇస్తారని, మందాడి సత్యనారాయణరెడ్డి పేరును తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ ఇవ్వలేదని, అందువల్ల వారికి అవకాశం ఇవ్వకూడదని ఆయన అన్నారు. మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినప్పుడు వారు ఏ పార్టీకి సంబంధించిన సభ్యులో చెప్పాల్సి ఉంటుందని, వారు స్వతంత్రసభ్యులు కారని ఆయన అన్నారు. తెరాస అసమ్మతి శాసనసభ్యులకు అవకాసం ఇవ్వడం సంప్రదాయానికి విరుద్ధమని, దీనిపై అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెరాస అసమ్మతి సభ్యులను విడిగా గుర్తించినప్పుడే వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, అలా గుర్తించకుండా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం నైతిక విలువలకు విరుద్ధమని సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు.












Click it and Unblock the Notifications