మజ్లీస్ అధినేత ఓవైసీ కన్నుమూత
హైదరాబాద్: మజ్లీస్ అధినేత సల్లావుద్దీన్ ఓవైసీ (76) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో గల స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు సభ్యుడు కాగా, మరో కొడుకు అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభ్యుడు.
సాలార్ గా పేరు పొందిన ఓవైసీ 1932 ఫిబ్రవరి 14వ తేదీన జన్మించారు. తండ్రి అబ్దుల్ వాహెద్ ఓవైసీ నుంచి 1958లో మజ్లీస్ పగ్గాలు తీసుకున్న ఓవైసీ హైదరాబాద్ పాతబస్తీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. పలు మార్లు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓవైసీ భౌతిక కాయానికి మంగళవారం సాయంత్రం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఓవైసీ మృతికి సంతాపసూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయం వద్ద ఉంచారు.












Click it and Unblock the Notifications