లగడపాటిపై కేసుకు తెరాస వినతి
హైదరాబాద్: నిజామాబాదులో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ ప్రమాదంలో గాయపడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్త చిన్నారెడ్డి సంఘటనపై కేసు ఎందుకు పెట్టలేదో తెలుకుంటానని రాష్ట్ర హోం మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. తమ పార్టీ కార్యకర్త ప్రమాదానికి కారణమైన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై కేసు నమోదు చేయాలని తెరాస శాసనసభ్యుల బృందం మంగళవారం జానారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ జానా రెడ్డి ఆ విధంగా చెప్పారు. లగడపాటి రాజగోపాల్ కార్యాలయంపై దాడి చేసిన తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కూడా తెరాస శాసనసభ్యులు హోంమంత్రిని కోరారు.
సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై కేసులు పెడతారని, ప్రస్తుతం పెట్టిన కేసులో తుదివి కావని హోం మంత్రి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ప్రణబ్ ముఖర్జీ నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు తెరాస కార్యకర్తలు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రణబ్ కాన్వాయ్ లోని ఒక కారు దూసుకుపోయి తెరాస కార్యకర్త కాలు విరిగింది. ప్రమాదానికి కారణమైన కారు లగడపాటి రాజగోపాల్ కు చెందిందని తెరాస ఆరోపిస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొంత మంది తెరాస కార్యకర్తలు హైదరాబాదులో రాజగోపాల్ కు చెందిన ల్యాంకో కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. తెలంగాణపై నివేదిక సమర్పించడంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ జాప్యాన్ని నిరసిస్తూ తెరాస కార్యకర్తలు ఆ రోజు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications