కరెంట్ కోత లేకుండా చేస్తాం: వైయస్
మహబూబ్‌నగర్ : రానున్న రోజుల్లో రిలయన్స్ గ్యాస్ ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు.ఎగువ జూరాల విద్యుత్‌కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తరువాత దిగువ జారాల విద్యుత్‌కేంద్రానికి శంకుస్థాపన చేశారు. తమది ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వమని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ కరువు జిల్లాగా, వలసల జిల్లాగా పేరు పొందిందని, జిల్లా కరువును శాశ్వతంగా పరిష్కరిస్తామని, జిల్లాకు చెందిన నాలుగు సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పనికి ఆహారం పథకం కింద వచ్చిన బియ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కాల వాళ్లు పందికొక్కుల్లా మేశారని, తమ ప్రభుత్వంలో పందికొక్కులు లేవని, ఉపాధి హామీ పథకం కింది ప్రతి పైసా ప్రజలకు చేరుతుందని ఆయన చెప్పారు. తాము ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత విద్యుత్తును ఇస్తున్నామని ఆయన చెప్పారు. రైతులకు రుణమాఫీ వంటి పలు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఆయన సభలో వివరించారు.












Click it and Unblock the Notifications