చిరుతో కయ్యం: సైకిల్ తో సవారీ
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలని సిపిఎం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోల్ కత్తాలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ఈ విషయమై ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కొత్త పార్టీ అయిన ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవడానికి బదులు నాలుగేళ్లుగా కలిసి పనిచేస్తున్న తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడమే మేలని సిపిఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వచ్చే రెండు రోజుల సమావేశాల్లో సిపిఎం ఈ విషయంలో ఒక స్పష్టతకు వస్తుంది.
కాగా, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులుకు విధానాల విషయంలో మాటల యుద్ధం సాగింది. చిరంజీవి తన పార్టీ విధానాలను వెల్లడిస్తే తాము పొత్తులపై నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుందని రాఘవులు చేసిన ప్రతిపాదనను చిరంజీవి తిరస్కరించారు. పార్టీల కోసం తాము విధానాలను ప్రకటించబోమని, ప్రజల కోసం మాత్రమే వెల్లడిస్తామని చిరంజీవి సోమవారం స్పష్టంగా చెప్పారు. పొత్తులపై ఇప్పుడే తేల్చలేమని కూడా చిరంజీవి అన్నారు. దీనిపై రాఘవులు తీవ్రంగా మండిపడ్డారు. దీన్ని బట్టి ప్రజారాజ్యం పార్టీకి సిపిఎం దగ్గరయ్యే సూచనలు తక్కువేనని అనుకుంటున్నారు.
కాగా, సిపిఐ ప్రజారాజ్యం పార్టీకి దగ్గరగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే, సిపిఐని కూడా తమ కూటమిలోకి తెచ్చేందుకు సిపిఎం ప్రయత్నిస్తోంది. నవంబర్ 1వ తేదీలోగా ఒక నిర్ణయానికి రావాలని సిపిఎం సిపిఐని కోరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications