ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని జూబిలీహిల్స్ లో గల నవనిర్మాణ్ నగర్ గుడిసెల తొలగింపును అడ్డుకున్న ఖైరతాబాద్ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. అక్రమంగా గుడిసెలు వేసుకున్నారంటూ అధికారులు వాటిని తొలగించడానికి వచ్చారు. అధికారులను గుడిసెవాసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అధికారులకు, గుడిసెవాసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
ఈ సందర్భంగా ఒక మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను పోలీసులు నివారించారు. ఇరవై ఏళ్లుగా వారు అక్కడ ఉంటున్నారని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వారికి ఇళ్ల స్థలాలు అక్కడే ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications