ఎంఎన్ఎస్ హింసకు బీహార్ విద్యార్థి బలి
పాట్నా: మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కార్యకర్తల దాడిలో బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాకు చెందిన ఒక విద్యార్థి మరణించాడు. ఆదివారం రైల్వే బోర్డు పరీక్షల సందర్భంగా ఎంఎన్ఎస్ కార్యకర్తలు ముంబయిలోని పరీక్షా కేంద్రాలపై దాడి చేశారు. ఈ సందర్భంగా వారు కొట్టడంతో పవన్ కుమార్ అనే విద్యార్థి మరణించాడు. విద్యార్థి మృతిపై బీహారులోని పాట్నాలో, ఇతర పట్టణాల్లో నిరసన పెల్లుబుకుతోంది. ఎంఎన్ఎస్ దాడులకు తొలి బాధితుడు పవన్ కుమారే. పవన్ కుమార్ బీహారులోని నలంద జిల్లాలో గల బారా - కుర్దు గ్రామానికి చెందినవాడు. ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆదివారంనాడు వందలాది మంది విద్యార్థులను కొట్టారు. అయితే, పవన్ కుమార్ మాత్రం ఆ దెబ్బలకు మృత్యువాత పడ్డాడు.
పవన్ మృతదేహం మంగళవారం ఉదయం పాట్నా రైల్వే స్టేషనుకు చేరుకుంది. మృతదేహాన్ని చూడడానికి వచ్చిన విద్యార్థులు తమ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. ఎంఎన్ఎస్ నేత రాజ్ థాకరేపై హత్యా కేసు నమోదు చేయాలని, మహారాష్ట్ర నుంచి రాజ్ థాకరేను మరో ప్రాంతానికి పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పవన్ మరణించినట్లు ముంబయి పోలీసులు అతని తండ్రి జగదీష్ మెహతోకు తెలియజేశారు. తల్లిదండ్రులకు పవన్ ఒక్కడే సంతానం. మృతుని కుటుంబ సభ్యులకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్షన్నర రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications