చిరు తెలంగాణ పర్యటన సక్సెస్

తెలంగాణ పర్యటనలో ముందుగా చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తన వైఖరిని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలుగా భావిస్తున్నవారు కొంత మంది కోడిగుడ్లతో దాడి చేయడం మినహా చిరంజీవి తెలంగాణ పర్యటన సజావుగా సాగింది. అదే విధంగా చేనేత కార్మికులకు ఆయన పలు పథకాలు ప్రకటించారు. గిరిజనులకు కూడా తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను వెల్లడించారు.
మరో విశేషమేమంటే - ఉత్తరాంధ్ర పర్యటనలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై కాస్తా మెతక వైఖరి అవలంబించినట్లు కనిపించింది. తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సునిశితమైన విమర్శలు చేశారు. జలయజ్ఞం వంటి పథకాల్లో అవినీతిపై ఆయన ధ్వజమెత్తారు. దాంతో కాంగ్రెస్ నాయకులు చిరంజీవిపై విమర్శల వర్షం కురిపించాల్సి వచ్చింది. ఈ రకంగా చిరంజీవి కాంగ్రెసుకు సవాల్ విసిరారని భావించవచ్చు.
బిజెపితో కొనసాగించే సంబంధాలపై కూడా చిరంజీవి వివరణ ఇచ్చారు. ఆయన ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదంగా మారింది. బిజెపి పట్ల తాను అనుసరించే వైఖరిని ఆయన స్పష్టం చేయాల్సి వచ్చింది. బిజెపితో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో సిపిఐ పూర్తిగా ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవడానికి వీలు కల్పించారు.












Click it and Unblock the Notifications