ఇది కెసిఆర్ ఒత్తిడి వల్లనే: లగడపాటి
నెల్లూరు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఒత్తిడివల్లనే తెంలగాణ అంశాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఏకాభిప్రాయ సాధనతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం వల్ల తెలంగాణ అంశం పక్కన పడిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కొన్ని పార్టీలు స్పష్టంగా తమ వైఖరులను వెల్లడించడం లేదని, కొన్ని పార్టీలు తమ అభిప్రాయాలే చెప్పడం లేదని, దీంతో తెలంగాణ అంశం పక్కన పడిందని ఆయన అన్నారు.
గతంలో తోకపార్టీలుగా వ్యాఖ్యానించిన వామపక్షాలతో కెసిఆర్ స్నేహం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని ఎక్కడ పెట్టాలి, నిధుల పంపకం ఎలా జరగాలి, ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి అనే విషయాలు తేల్చకుండా రాష్ట్ర విభజనకు దిగడం సాధ్యం కాదని ఆయన అన్నారు. యువగర్జనకు ధీటుగా తాము సభను నిర్వహించే ఆలోచన లేదని ఆయన చెప్పారు. యువగర్జన సదస్సులో పాల్గొన్నవారంతా వృద్ధులేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications