బాబు వ్యాఖ్య విచారకరం: తెరాస
హైదరాబాద్: ప్రజలను తాము రెచ్చగొడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆరోపించడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తాము ప్రజలను రెచ్చగొడితే ఇన్నాళ్లు ఉద్యమాన్ని నడిపి ఉండేవాళ్లం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలను తెరాస ఎంపి వినోద్ కుమార్ కూడా తప్పు పట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తాము వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటామని ఆయన చెప్పారు. ఎవరికి బలం ఉందో 2009 ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని ఆయన అన్నారు.
తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో న్యాయం చేసే 610 జీవో అమలుపై ప్రభుత్వం తీరును హరీష్ రావు తప్పు పట్టారు. హోంశాఖలో బదిలీలకు ఇచ్చిన ఉత్తర్వులపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని, ఈ స్టే తొలగింపునకు ప్రభుత్వం 14 నెలలుగా కౌంటర్ వేయలేదని ఆయన అన్నారు. తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులకు గండీ కొట్టే చర్యలకు ఒడిగట్టిందని ఆయన విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సూత్రధారి అయితే, హోంమంత్రి కె. జానారెడ్డి పాత్రధారి అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications