అసెంబ్లీ నుంచి విపక్షాల వాకౌట్
హైదరాబాద్: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు మంగళవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. పెట్రోల్, డిజీల్ ధరలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నా అందుకు చర్యలు చేపట్టడం లేదని విమర్శించాయి. పన్నులు తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి అవకాశం ఉందని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, ఇది సామాన్యులకు పెనుభారంగా మారిందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా తక్కువ ధరలకు ఇస్తున్నామని చెప్పిన పప్పు ధాన్యాలు ఎవరికీ అందడం లేదని, అవి కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్తున్నాయని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. గ్యాస్ ఇవ్వడమే మానేశారని ఆయన అన్నారు.
చంద్రబాబు విమర్శకు మంత్రి కొణతాల రామకృష్ణ తీవ్రంగా ప్రతిస్పందించారు. డిజీల్, పెట్రోల్ లపై తెలుగుదేశం ప్రభుత్వమే పన్నులు వేసిందని, ఆ పన్నులను తమ ప్రభుత్వం పెంచలేదని, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చౌక ధరల దుకాణాల వద్ద కూర్చుని చూస్తే పేదలకు పప్పు ధాన్యాలు ఎంత బాగా అందుతున్నాయో తెలుస్తుందని ఆయన అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications