కేరళ సిఎం క్షమాపణ
తిరువనంతపురం: జాతీయ భద్రతా దళాల (ఎన్ఎస్జీ) కమాండర్, దివంగత సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబంపై తాను అసలు వ్యాఖ్యలే చేయలేదని, సందీప్ తండ్రి కాకపోతే ఆయన ఇంటికి కుక్కలు కూడా వెళ్లవని తాను అన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ అన్నారు. తన మాటలను మీడియా, ప్రతిపక్షాలు వక్రీకరించాయని ఆయన ఎదురుదాడికి దిగారు. ఉన్నికృష్ణన్ కుటుంబంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బుధవారం కేరళ శాసనసభలో తీవ్ర రభస జరిగింది. ముఖ్యమంత్రి క్షమాపణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అచ్యుతానందన్ వ్యాఖ్యలపై విచారం వెలిబుచ్చినా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పనందుకు నిలదీశాయి. దీంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రతిపక్ష నేత వుమెన్‌చాందీని తీవ్రంగా దూషించారు. తాను అసలు ఏ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.
అయితే ఎట్టకేలకు అచ్యుతనాందన్ తమ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఉన్నికృష్ణన్ కుటుంబాన్ని గాయపరిచి ఉంటే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. ముంబై దాడులకు ప్రాముఖ్యం ఇవ్వడానికి బదులు మీడియా ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. అచ్యుతానందన్ వ్యాఖ్యలకు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ మంగళవారం విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications