కాంగ్రెసుపై అక్బరుద్దీన్ ప్రశంసలు
హైదరాబాద్: మైనార్టీలకు ఎవరైనా ఏమైనా చేశారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఉగ్రవాదంపై గురువారం శాసనసభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు మాట్లాడతున్నప్పుడు జోక్యం చేసుకుని ఆయన ఆ విధంగా అన్నారు. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఎందరో ముస్లింలు ఉన్నత విద్యను పొందారన్నారు. స్కాలర్‌షిప్పుల వల్ల ఎందరో పేద విద్యార్థులు బాగుపడుతున్నారని అన్నారు. స్వయం ఉపాధి పథకాల వల్ల ఎందరి జీవితాలో బాగుపడుతున్నాయని ప్రశంసించారు. వక్ఫ్ భూములపై వారి వైఖరిని కొనియాడారు. బైంసా అల్లర్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం స్పందించిన తీరును కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
సభ పది నిమిషాల పాటు వాయిదా అనంతరం తిరిగి శాసనసభ ప్రారంభమైంది. ఉగ్రవాదంపై చర్చ కొనసాగింది. సభలో పరిణామాలు దురదృష్టకరమని, ఇలాంటి సమయంలో ఉగ్రవాదాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలని తెరాస సభ్యుడు హరీష్‌రావు అన్నారు. అనంతరం టీడీపీ తరపున చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మెతకవైఖరే అందుకు కారణమని అన్నారు. చెన్నారెడ్డి హయాంలో ముస్లింలపై తీవ్రంగా దాడులు జరిగితే పార్టీలతో సంబంధం లేకుండా అణచివేశామని, మైనార్టీలకు రక్షణ కల్పించామని అన్నారు. ఈ సమయంలో అక్బరుద్దీన్ ఓవైసీ జోక్యం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications