లష్కరే కమాండర్ లఖ్వీ అరెస్టు
ఇస్లామాబాద్: 26/11 ముంబయి మారణహోమం సూత్రధారిగా భారత్ అనుమానిస్తున్న లఖ్వీతోపాటు 20 మందికి పైగా లష్కరే ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో అరెస్టయ్యారు. ప్రేలుళ్ళ పథకం వేసిన లష్కరే కమాండర్లలో లఖ్వీ ఒకడని ముంబయి ప్రేలుళ్ళ ఘటనలో పోలీసులకు పట్టుబడ్డ ఒకే ఒక్క ఉగ్రవాది మొహమ్మద్ అజ్మల్ అమీర్ ఇమాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. నిషేధిత లష్కరేపై ఇస్లామాబాద్ చర్య తీసుకోవాలంటూ అమెరికా, భారత్ ఒత్తిడి పెంచుతుండడంతో.. పాక్ సైన్యం, ఇతర భద్రతా సంస్థలు హెలికాప్టర్ల అండతో తాజా దాడులు జరిపాయి. వీటిలో పలువురు ఉగ్రవాదులు గాయపడ్డారు.
ఈ విషయాన్ని పాక్ అధికారి ఒకరు సోమవారమిక్కడ వెల్లడించారు. ఇతర ఉగ్రవాదులపైనా దాడులు మొదలైనట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం లష్కరే ఉగ్రవాదులపై, దాని రాజకీయ విభాగం జమాతుద్ దవా(జేయూడీ-జుడ్) కార్యకర్తలపై పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో, పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా దళాలు దాడులు ఆరంభించాయి.పీవోకే రాజధాని ముజఫరాబాద్ సమీపంలోని లష్కరే శిబిరంపై జరిపిన దాడుల్లో లఖ్వీ సహా 20 మందికి పైగా అరెస్టయ్యారు. అక్కడ మూడు గంటలపాటు కాల్పుల అనంతరం వీరిని భద్రతా సంస్థలు పట్టుకొన్నాయి. పాక్‌లోని 'జియో న్యూస్' ఛానల్ సోమవారం ఈ విషయం తెలిపింది.ఇక లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ఈ దాడులను ఖండించాడు. పీవోకేలోని జిహాదీ సంస్థలపై దాడి తగదన్నాడు.












Click it and Unblock the Notifications