హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు చంద్రబాబు సమక్షంలో శుక్రవారంఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో భారీ అనుచరగణంతో తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ... 'పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్ని పదవులూ అనుభవించి, ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి బయటకు వెళ్లిన వారు చరిత్రహీనులయ్యారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను సహించలేక ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకుని తన సొంతపార్టీ తెలుగుదేశంలోకి ముద్దుకృష్ణమ నాయుడు వచ్చారు. ఇది అభినందనీయం' అని పేర్కొన్నారు. ముద్దును మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి పేదలకు సేవ చేసేందుకు అంతా కలిసి పని చేయాలని కోరారు. అనంతరం ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడారు. పార్టీ కార్యకర్తగా చంద్రబాబు, చిత్తూరు జిల్లా నేతలు చెప్పినట్లు పని చేస్తానని తెలిపారు. మీలో ఒకడిగా భావించాలని, కలిసి పనిచేసేందుకు సహకరించాలని కోరారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య, జడ్పీటీసీ సభ్యులు కూడా చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.