టిడిపికి వేణుగోపాలాచారి గుడ్ బై?
హైదరాబాద్: తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యుడు ఎస్. వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తనను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేయడంపై ఆయన అలక పూనినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో తనను పక్కన పెట్టి రమేష్ రాథోడ్ కు ప్రాధాన్యం ఇవ్వడం ఆయనకు మనస్తాపం కలిగించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుంటే, ఆయన కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావును కలిసినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. వేణుగోపాలాచారి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య పొత్తు కుదిరితే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి తెరాస పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెసుకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications