న్యూయార్క్: సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌లు పెద్ద మొత్తంలో తమ సంస్ధకు విరాళమిచ్చినట్లు క్లింటన్ ఫౌండేషన్ సంస్థ విడుదల చేసిన జాబితా వెల్లడించింది. పేదరికాన్ని నిర్మూలించడానికి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను ఆదుకునేందుకు అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఏర్పాటుచేసిన ఫౌండేషన్‌కు భారతీయుల నుంచి భారీ విరాళాలు అందుతున్నాయి. 10లక్షల డాలర్లు (దాదాపు రూ.5కోట్లు) నుంచి 50లక్షల డాలర్ల (దాదాపు రూ.25కోట్లు) మధ్య విరాళాలిచ్చిన దాతలజాబితాలో ఈ ఇరువురిపేర్లు ఉన్నాయి. జాబితాలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉంది. ఇది 5లక్షల డాలర్ల (రూ.2.5కోట్లు) నుంచి 10లక్షల డాలర్ల మధ్య విరాళాలిచ్చిన దాతల విభాగంలో ఉంది. లలిత్‌సూరి, వినోద్ గుప్తా, అజిత్ గులాబ్‌చంద్‌లు రూ.1.75కోట్ల నుంచి రూ.2.5కోట్ల మధ్య విరాళమిచ్చినవారిలో ఉన్నారు. ఇండియాటుడే గ్రూప్, రిలయన్స్ యూరోప్, రాన్‌బ్యాక్సీ ఫార్మాస్యూటికల్స్ సంస్థలు రూ.50లక్షల నుంచి రూ.1.75కోట్ల మధ్య విరాళమిచ్చాయి.భారతీయులనుండే భారీ స్ధాయిలో విరాళాలు రావటం వారి ఔదార్యానికి సూచన అంటున్నారు.