ఎసిబి దాడుల్లో చిక్కిన మరో ఇంజినీర్
హైదరాబాద్: రాష్ట్రంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్న అధికారులపై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ కె. ధర్మా ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా మూడు కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్థులను కనుగొన్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో పనిచేసే ధర్మా డెప్యుటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి వచ్చారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు పనుల్లో కొంతభాగాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆస్ధుల మార్కెట్ విలువ ఎన్నో రెట్లు ఉండవచ్చని ఎసిబి అధికారులు చెప్పారు.
వరంగల్ జిల్లాలోని ఆయన బంధువుల ఇళ్ళ మీద కూడా ఒకేసారి దాడులు జరిగాయి. అనేక ఇళ్ళు, ఇళ్ళ స్ధలాలతో పాటు నగర శివారులో ఆయనకు 12 ఎకరాల భూమి ఉన్నట్టు ఎసిబి సోదాల్లో వెల్లడైంది. కాగా మీడియా ఎదుట ఎసిబి అధికారులపై ధర్మా దంపతులు ఆగ్రహించారు. భార్య, భర్త ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇళ్ళు కట్టుకోమా, ఆస్ధులు సంపాదించుకోమా అని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. తమ ఆస్ధులన్నిటికీ రికార్డులు ఉన్నాయని, తాము రెగ్యులర్గా ఇన్ కంటాక్స్ రిటర్న్ లను ఫైల్ చేస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications