సిఎంకు సిగ్గు లేదు: చిరంజీవి

మెదక్ జిల్లా పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్‌లలో సోమవారం జరిగిన ప్రజా అంకిత సభలలో అవినీతే ప్రధాన అంశంగా ఆయన ప్రసంగాలు సాగాయి. నాలుగేళ్ల క్రితం ఏసీబీకి చిక్కిన ఉద్యోగి.. తిరిగి అదే పోస్టు పొందారంటే అవినీతి కారణం కాదా? అని చిరంజీవి ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ఆ అధికారి ఎలుగుబంటి సూర్యనారాయణ వందల కోట్లు సంపాదించారంటే అవినీతి కాక మరేమిటన్నారు.
'మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు లేనిదే సూర్యనారాయణ ఇంతపెద్ద అవినీతికి పాల్పడతారా? ఈ డబ్బులు ఎవరివి? మీవి కావా? మీకు దక్కాల్సిందే కదా?' అన్నారు. ఈ వ్యవహారంపై లోకాయుక్తకు వెళ్లకుండా, న్యాయ విచారణ జరిపించకుండా వారంతట వారే విచారణ జరిపించుకుని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్లీన్‌చిట్ ఇచ్చుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
'డిపెప్ అవినీతిలో ముఖ్యమంత్రి అంతరంగికుడు సూరీడు పాత్ర ఉన్నా ఆయన మంచివాడంటూ ప్రమోషన్ ఇచ్చారు. ఇసుక కుంభకోణంలోనూ వారే కోర్టులు. వారే జడ్జిలు. వారే తీర్పులు ఇచ్చేసుకున్నారు' అని ఎద్దేవా చేశారు. వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ వారు తమ వారయినా మంచివారంటూ సీఎం కితాబు ఇచ్చుకోవడం సిగ్గుమాలిన పని అని విమర్శించారు.
'ఓ చిన్న ఆరోపణ వస్తే గతంలో లాల్‌బహదూర్‌శాస్త్రి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పడిపోయింది. పీవీ నర్సింహారావుపై కోటి రూపాయల అవినీతి ఆరోపణలు వస్తే ఆయన విలవిల్లాడిపోయారు' అని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు నేడు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ.. పైగా సిగ్గు లేకుండా మాట్లాడడం వారికే చెల్లిందంటూ తీవ్రంగా విమర్శించారు.












Click it and Unblock the Notifications