అమెరికాలో మరో ఆంధ్రుడి మృతి
అనంతపురం: అమెరికాలో మరో ఆంధ్రుడు అనుమానాస్పద పరిస్ధితిలో మరణించాడు. అనంతపురానికి చెందిన పురుషోత్తం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఆయన మరణవార్త తెలియడంతో అనంతపురంలోని వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. పురుషోత్తం గత ఏడాదే భార్యను తీసుకొని అమెరికా వెళ్లారు. నైట్ డ్యూటీ ముగించుకుని వచ్చిన పురుషోత్తం భార్యకు డే డ్యూటీ ఉండడంతో ఆమెను కార్యాలయం వద్ద వదిలిపెట్టి వచ్చినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
డ్యూటీ ముగించుకున్న అనంతరం ఎంతసేపు ఫోన్ చేసినా పురుషోత్తం లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె వెంటనే టాక్సీలో ఇంటికి వచ్చినట్టు తెలిసింది. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి ఆమె పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి తలుపులను బలవంతంగా తీసి చూడగా, బాత్‌రూంలో పురుషోత్తం నిర్జీవంగా పడివుండడం గుర్తించినట్టు సమాచారం. మృతికి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సివుంది.
పురుషోత్తం ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక మెడిసిన్ డోస్ ఎక్కువ కావడం వల్ల మృతి చెందాడా? అన్న విషయం కుటుంబ సభ్యులకు అంతుపట్టడం లేదు. మూడు నెలలుగా పురుషోత్తం తలనొప్పితో బాధపడుతున్నట్టు ఆయన భార్య ప్రవీణా రెడ్డి కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులకు చెప్పినట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో పురుషోత్తం మృతదేహం అనంతపురానికి చేరే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications