రామలింగరాజు కస్టడీ మరో రోజు

కోర్టులో ఈరోజు జరిగిన వాదోపవాదనలు ఇవి.....సత్యం కంపెనీలో 53వేలమంది ఉద్యోగులు ఉన్నారని యాజమాన్యం చెబుతూ వచ్చిందని, వారి జీతభత్యాలకు ఏడాదికి 20 వేలకోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నట్లు లెక్కలు చూపారని అదంతా వాస్తవం కాదని సీఐడీ తరపు న్యాయవాది ఈరోజు నాంపల్లి కోర్టుకు తెలిపారు. రామలింగరాజు సీఐడీ కస్టడీ గడువు ముగియటంతో ఈరోజు ఆయనను కోర్టులో హాజరుపరిచారు.
కస్టడీ గడువు మరో మూడు రోజులు పొడిగించాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. రామలింగరాజు ఎన్నో అబద్ధాలు చెప్పారని పేర్కొంటూ వాస్తవంగా సత్యం సంస్థలో ఉంది 40 వేల మందేనని ఆయన పేర్కొన్నారు. అలాగే బషీర్‌బాగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉన్నట్లు చూపిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా నిజానికి లేవని తెలిపారు. భారీగా నిధులు మళ్లించి వేల ఎకరాల భూములు కొన్నారని వాటిని 400 బినామీ పేర్లతో రిజిష్టర్ చేశారని తెలిపారు.
ఈ వ్యవహారంలో ఆకుల రాజయ్య పాత్రపై విచారణ చేయాల్సి ఉందని అన్నారు. వీటన్నిటికీ సమయం సరిపోనందున కస్టడీని పొడిగించాలని కోరారు. అయితే సీఐడీ అధికారులు సమయం వృథా చేసి పొడిగింపు కోరుతున్నారని రామలింగరాజు తరపు న్యాయవాది వాదించారు. సీఎఫ్‌ఓగా పనిచేసిన శ్రీనివాస్‌ను రోజుకు గంట మాత్రమే విచారించారని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని మధ్యాహ్నం 2.30కు వాయిదావేసింది.












Click it and Unblock the Notifications