రైల్లో కాల్పులు: ఆంధ్రుడికి గాయాలు
హైదరాబాద్: మన్మాడ్ ఎక్సుప్రెస్సులో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. దోపిడీ దొంగల కాల్పుల్లో గాయపడిన శివకుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం నాందేడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ప్రాణాపాయం లేదని ఆయన కుమారుడు ఫణికుమార్ చెప్పారు. షిర్డీ వెళ్తున్న మన్మాడ్ ఎక్సుప్రెస్సు రైల్లో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటా 20 నిమిషాల ప్రాంతంలో ఔరంగాబాద్ సమీపంలోని పర్బన్ వద్ద ఈ సంఘటన జరిగినట్లు ఇక్కడికి సమాచారం అందింది.
తెనాలికి చెందిన శివకుమార్ కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం పదిన్నర ప్రాంతంలో విజయవాడలో మన్మాడ్ ఎక్సుప్రెస్సులో ఎక్కారు. దొంగలు దోపిడీకి ప్రయత్నిస్తున్న సమీపంలో శివకుమార్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శివకుమార్ గాయపడ్డాడు. ప్రయాణికులు దోపిడీ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో దొంగ పారిపోయాడు.












Click it and Unblock the Notifications