ఎలుగుబంటి అవినీతిపై అసెంబ్లీ స్తంభన
హైదరాబాద్: మత్స్య శాఖ ఈఈ ఎలుగుబంటి సూర్యనారాయణ అవినీతిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో బుధవారం శాసనసభా కార్యక్రమాలు స్తంభించాయి. ప్రతిపక్షాల సభ్యులు ఎంతకీ వినకపోవడంతో స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి సభను రేపటికి వాయిదా వేశారు. సూర్యనారాయణ అవినీతిపై ప్రభుత్వం తగిన సమాధానం ఇవ్వాలని, ముందు ఆ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి స్పందించిన ఆర్థిక మంత్రి రోశయ్య- ఒక్క సూర్యనారాయణ అవినీతిపైనే కాదు రాష్ట్రంలో జరిగిన అన్ని అవినీతి భాగోతాలపైనా చర్చిద్దామని అన్నారు. నోటీస్ లేకుండా చర్చకు అవకాశం లేదని, ఏదైనా చర్చించాలనుకుంటే ప్రశ్నోతరాల సమయం ముగిశాక ముందుగా నోటీస్ ఇచ్చి ఆ తర్వాత చర్చించాలని స్పీకర్ సురేష్‌రెడ్డి సభ్యులను కోరారు. ప్రతిపక్షాల సభ్యులు వినకపోవడంతో స్పీకర్ తొలుత సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్షాల సభ్యులు సూర్యనారాయణ అవినీతిపై చర్చకు పట్టుబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టిన తర్వాత నోటీసు ఇస్తే సూర్యనారాయణ అవినీతిపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ చెప్పారు. అయినా ప్రతిపక్షాల సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications