స్పీకర్ తో చంద్రబాబు వివాదం

హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేయబోయే ప్రకటనపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డితో వివాదానికి దిగారు. స్పీకర్ తమను మోసం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రికి ప్రకటన చేసే హక్కు ఉంటుందని, అయితే ఏ అంశం మీద ప్రకటన చేస్తారో స్పీకరుకే తెలియకపోవడం సంప్రదాయం కాదని ఆయన అన్నారు. సభను అదృశ్య శక్తి నడిపిస్తోందని ఆయన అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును ప్రతిపాదించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామని స్పీకర్ చేసిన సూచనను ఆయన వ్యతిరేకించారు. సంప్రదాయం ప్రకారంఆ బిల్లు తర్వాత సభా కార్యక్రమాలు ఉండవని, అందువల్ల మిగతా విషయాలపై చర్చకు ముందే అనుమతించాలని చంద్రబాబు అన్నారు. తెలంగాణపై ప్రకటన చేస్తారా, మరో అంశం మీద ప్రకటన చేస్తారా అనేది చెప్పాలని ఆయన పట్టుబట్టారు. ప్రకటన గురించి ముందు చెప్పాల్సిన అవసరం లేదని స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి చెప్పారు.

చంద్రబాబు వాదనను స్పీకర్ ఖండించారు. ఆ బిల్లు తర్వాత కూడా సభలో బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భాలున్నాయని ఆయన చెప్పారు. అటువంటి వాటిని ఆయన ఉదహరించారు. తాను అందరి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని, స్పీకర్ కు తెలియకుండా తాను ఏ రోజు కూడా ప్రకటన చేయలేదని చంద్రబాబు అన్నారు. ఏ అంశం మీద ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారో చెప్పాల్సి ఉంటుందని, అలా చెప్పకపోవడం నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలుగుదేశం సభ్యుడు చెన్నమనేని రాజేశ్వరరావు అన్నారు. ఏ అంశం మీద ముఖ్యమంత్రి ప్రకటన ఉంటుందో ముందు చెప్పాల్సి ఉంటుందని, వివరాలు తర్వాత చెప్పవచ్చునని ఆయన అన్నారు.

చెన్నమనేని వాదనతో శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య విభేదించారు. ముఖ్యమంత్రి ప్రకటన గురించి ముందు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరుకు, ముఖ్యమంత్రి ప్రకటనపై వివరణ ఇవ్వకుండా ద్రవ్య వినిమయ బిల్లు ప్రతిపాదనకు నిరసనగా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఎం, సిపిఐ సభ్యులు వాకౌట్ చేశారు. ఏ అంశం మీద ప్రకటన చేస్తారో చెప్పకపోవడాన్ని బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+