వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ ఆస్తులు పది వేల కోట్లు: కూటమి

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: 2004 ఎన్నికలకు ముందు రూ.41 లక్షల ఆదాయం ఉన్న ముఖ్యమంత్రి వైయస్ కుటుంబం ఇప్పుడు రూ. 10 వేల కోట్లకు పడగలెత్తిందని మహా కూటమి నాయకులు ఆరోపించారు. వైయస్ కుటుంబ సభ్యులు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఎం, సిపిఐ నాయకులు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర రావు, బివి రాఘవులు, కె.నారాయణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అన్ని చట్టాలను వైయస్ కుటుంబం అతిక్రమించిందని, వైఎస్‌ అధికారాన్ని అడ్డంపెట్టుకొని సంపాదించిన అవినీతి డబ్బును మారిషస్‌ కంపెనీల పేరుతో హవాలా ద్వారా సొంత కొడుకు కంపెనీల్లో పెట్టుబడి పెట్టించారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ కుంభకోణమని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వై.ఎస్‌.ను ప్రాసిక్యూట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

జగన్‌ కంపెనీల్లో జరిగిన పెట్టుబడుల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుచేయడానికి ఢిల్లీ కొచ్చిన కూటమి నేతలు తమ పార్టీల శాసనసభ్యులు, మండలి సభ్యులను వెంటబెట్టుకొని బుధవారం సాయంత్రం కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రేమ్‌చంద్‌ గుప్తాను కలిశారు. జగన్‌ కంపెనీల్లో జరిగిన మోసాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పుస్తక రూపంలో మంత్రికి అందజేశారు. పెట్టుబడి మోసాల గురించి అరగంట పాటు ఆయనకు వివరించారు.

వై.ఎస్‌.జగన్‌ కంపెనీల్లోని పెట్టుబడుల కుంభకోణంలో సత్యం కంప్యూటర్స్ ను మించిన మోసాలున్నాయని చంద్రబాబు ఆరోపించారు. 1998లో సండూరు పవర్‌ ప్రాజెక్టు తీసుకొని దాని నిర్మాణం కూడా పూర్తిచేయలేని జగన్‌ తన తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టగొడుగుల్లా కంపెనీలు పెట్టి అవినీతి సొమ్మును వైట్‌మనీగా మార్చుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుమారుడి కంపెనీల్లో 14 కోల్‌కతా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని, ఇవన్నీ నల్లధనాన్ని శ్వేత ధనంగా చేసే షెల్‌ కంపెనీలేనని గుర్తుచేశారు. వీటికి నష్టాలు వచ్చినట్లు వాటి రికార్డులే చెబుతున్నాయన్నారు. అలాంటి కంపెనీలు 'సాక్షి' పత్రికలో రూ.43 కోట్లు ఎలా పెట్టగలిగాయని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ సంస్థలకు, వ్యక్తులకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఆర్థికమండళ్లు, కాంట్రాక్టులు ఇచ్చి వారి నుంచి కమీషన్‌గా తీసుకొన్న అవినీతి డబ్బును మారిషస్‌ మార్గంలో తిరిగి కొడుకు కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న ఇలాంటి వ్యక్తులను కచ్చితంగా శిక్షించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి కంపెనీల్లో జరిగిన కుంభకోణంపై తాము కేవలం ఆరోపణలు చేయడంలేదని, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీ ద్వారా సంపాదించిన డాక్యుమెంట్లతో సహా నిరూపిస్తున్నామని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణం జరిగినట్లు కాగ్‌, లోకాయుక్తలు చెప్పినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. శాసనసభ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం బుట్టదాఖలు చేశారని ధ్వజమెత్తారు.

66 దేశాల్లో కంపెనీలున్న సత్యం కేసును సీఐడీకి అప్పగించడం వెనుక వైఎస్‌ హస్తం ఉందన్నారు. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మేటాస్‌ కంపెనీకి రూ.120 కోట్ల పనులు అప్పగించారని బాబు విమర్శించారు. హైదరాబాద్‌ మెట్రోలో భారీ కుంభకోణం జరగబోతోందని రైల్వే నిపుణుడు శ్రీధరన్‌ చెబితే ఆయన మీద పరువునష్టం దావా వేస్తామని బెదిరించారని విమర్శించారు. జలయజ్ఞం పనుల్లో ముఖ్యమంత్రికి 10 శాతం కమీషన్లు అందాయని ఆరోపించారు. అందుకే రూ.లక్షన్నరకోట్ల పనులను కేవలం 9 కంపెనీలకే కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అందులో మేటాస్‌ కూడా ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X