LPG, ATM, UPI లో మే 1 నుంచి భారీ మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా చమురు వాణిజ్యానికి వెన్నెముక అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. భారత్ లోనూ పరిస్థితులు మారిపోయాయి. అనేక రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అలాగే గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 1 నుంచి పలు అంశాల్లో భారీ మార్పులు రాబోతున్నట్లు స్పష్టం అవుతోంది. LPG, ATM, UPI సేవల్లో ఈ మార్పులు ఉండనున్నట్లు సమాచారం.
ఇక దేశంలోని ప్రస్తుత పరిస్థితుల కారణంగా మే 1, 2026 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు రానున్నాయి. అలాగే సిలిండర్ బుకింగ్స్ లోనూ మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. ఇకపై గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో 25 రోజుల గ్యాప్ కచ్చితంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాంతోపాటు ఓటీపీ బేస్డ్ డెలివరీ వ్యవస్థను ఇకపై పకడ్బందీగా అమలు చేయనున్నారు. నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. అంతేకాక అంతర్జాతీయ చమురు ధరల్లో మార్పుల కారణంగా డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ఇక యూపీఐ లావాదేవీలపైనా పలు కొత్త రూల్స్ రానున్నాయి. ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ గైడ్ లైన్స్ లో భాగంగా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీల్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఇకపై 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఓటీపీ, బయోమెట్రిక్ తప్పనిసరి కానుంది. అలాగే కొన్ని బ్యాంకుల్లో ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను లేదా నగదు ఉపసంహరణ పరిమితులను సవరించే అవకాశం కనిపిస్తోంది. పరిమితి దాటితే అదనపు ఛార్జీలు పడే ప్రమాదం ఉంది.
అలాగే పాన్ కార్డు వినియోగదారులకు ముఖ్యమైన విషయం ఏంటంటే.. సంవత్సరానికి రూ. 10 లక్షలకుపైగా నగదు డిపాజిట్ లేదా విత్ డ్రా చేసేవారికి పాన్ కార్డు వివరాలను సమర్పించే విషయంలో కఠినమైన రూల్స్ రానున్నాయి. అంతేకాక పాన్ దరఖాస్తు విధానంలోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు క్రెడిట్ కార్డు బిల్లింగ్ విషయంలో మార్పులు రానున్నాయి. లేట్ పేమెంట్ ఫీజ్ అలాగే రివార్డు పాయింట్ల వినియోగంపై కొత్త పరిమితులు విధించే అవకాశం ఉంది.

అంతేకాక మే 1 నుంచి రైలు టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ఇకపై ప్రయాణానికి 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ లభించే అవకాశం లేకపోవచ్చు. ఇక గ్యాస్ ధరల సమీక్ష నేపథ్యంలో సీఎన్జీ, పీఎన్జీ ధరల్లో మార్పులు రానున్నాయి.












Click it and Unblock the Notifications