ఉన్నపళంగా అమెరికాలో స్తంభించిన వేలాది విమానాలు- ఎయిర్‌పోర్టుల్లో జనం గగ్గోలు
అమెరికా వ్యాప్తంగా విమాన సర్వీసులు ఉన్నపళంగా స్తంభించిపోయాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో ఊహించని రీతిలో పెద్ద ఎత్తున సాంకేతిక లోపం తలెత్తడంతో దేశవ్యాప్తంగా అన్ని విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో ఏర్పడిన ఈ టెక్నికల్ అవుటేజ్ వల్ల అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లు, ప్రయాణంలో ఉన్న విమాన పైలట్లకు మధ్య సమాచార మార్పిడిని అందించే రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్‌లో లోపం తలెత్తడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రోలింగ్ ఫ్రీక్వెన్సీ సరిగ్గా పనిచేయకపోవడంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ల సమన్వయం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే గాల్లో ఉన్న విమానాలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనుమతి ఇచ్చారు.

రన్‌వేలపై ఉన్న ఏ విమానం కూడా టేకాఫ్ తీసుకోవడానికి అనుమతులు ఇవ్వట్లేదు. ఈ అవుటేజ్ వల్ల దేశవ్యాప్తంగా 7,000కు పైగా విమానాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ఫ్లైట్‌రాడార్24 అంచనా వేసింది. బోస్టన్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని యుఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లలో సమాచార వ్యవస్థను పునరుద్ధరించడానికి టెక్నికల్ టీమ్స్ యుద్ధప్రాతిపదికన పనిచేస్తోన్నాయని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వెల్లడించారు. నెట్‌వర్క్ సమస్య పూర్తిగా తొలగిపోయిన తర్వాతే విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తామని అన్నారు. ఒకవేళ ఈ సమస్య మరో ఆరు గంటల పాటు కొనసాగితే.. విమాన సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కనీసం రెండు రోజుల సమయం పట్టవచ్చని ఫెడరల్ ఏవియేషన్ భావిస్తోంది.
ఈ అంతరాయానికి గల కారణాలపై పలు రకాల వాదనలు వినిపిస్తోన్నాయి. ఇటీవల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిర్వహణలో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను ప్రవేశపెట్టారు. ఇందులో ఏర్పడిన లోపాలే కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీశాయా అనే కోణంలో పరిశీలిస్తోన్నారు. గతంలో 2023లో కూడా అమెరికాలో ఇలాంటి సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ.. అప్పట్లో కొన్ని గంటల్లోనే పరిష్కారమైంది గానీ.. ఇప్పుడు తీవ్రం జాప్యం ఏర్పడొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విమానయానం డిజిటల్ వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడుతుండటం వల్ల చిన్నపాటి సాంకేతిక సమస్యలు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోన్నాయి. దీనికి మైక్రోసాఫ్ట్ అవుటేజ్ కు సంబంధం లేదని ఫెడరల్ ఏవియేషన్ పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోన్నారు. ప్రయాణికులు విమానాశ్రయాలకు బయలుదేరే ముందు తమ విమానాల తాజా స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లు లేదా కస్టమర్ కేర్ ద్వారా ధృవీకరించుకోవాలని సూచించారు.
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో తలెత్తిన లోపాల కారణంగా భారత్‌లోనూ ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశా ఎయిర్ వంటి ప్రముఖ విమాన సంస్థల కస్టమర్ మద్దతు సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రయాణికుల ప్రశ్నలకు బదులివ్వడంలో విమాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు అమెరికా ఏటీసీలో చోటుచేసుకున్న ఈ ఘటన డిజిటల్ మౌలిక వసతుల భద్రతపై ఆందోళనలను పెంచుతోంది.














Click it and Unblock the Notifications
