బెంగాల్ లో నేడే రెండో విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి
పశ్చిమ్ బెంగాల్ లో రెండో విడత పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో భాగంగా బెంగాల్ లోని మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న తొలి విడత పోలింగ్ లో భాగంగా మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ లో 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఓటింగ్ కోసం 41వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్దం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.
ఇక బెంగాల్ లో రెండో విడత పోలింగ్ లో భాగంగా 142 అసెంబ్లీ స్థానాలకు గాను 1,448 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మేరకు 3.21కోట్లమంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. వీరిలో దాదాపు 1.64 కోట్ల మంది పురుషులు కాగా 1.57 కోట్ల మంది మహిళలు ఉన్నారు. బెంగాల్ లో మొదటి విడతలో భాగంగా ఏకంగా 92 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో విడతలోనూ అదే స్థాయిలో ఓటింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మే 4 న బెంగాల్ తో పాటు ఇదివరకే పోలింగ్ పూర్తి చేసుకున్న అసోం, కేరళం, పుదుచ్చేరి తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

మరోవైపు ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications