పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను భగ్నం చేశాం: అమిత్ షా సంచలనం
భారత్ లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పన్నిన ఉగ్ర కుట్రను విజయవంతంగా ఛేదించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఆగస్టు 15 కంటే ముందే ఐఎస్ఐ తీవ్రవాది.. పాకిస్థాన్‌కు చెందిన షహజాద్ భట్టి నెట్ వర్క్ ను భద్రతా సంస్థలు ఛేదించాయని తెలిపారు.
ఈ మేరకు 80 వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లు హోంమంత్రి అమిత్ షా తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో200 కు పైగా టెర్రర్ గ్రూప్ ఆపరేటివ్స్ ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. భారీ ఎత్తున చేపట్టదలచిన ఉగ్రవాద దాడుల కుట్రలను భగ్నం చేశామని ఆయన స్పష్టం చేశారు.
" ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు మోదీ ప్రభుత్వం 200 మందికి పైగా టెర్రర్ గ్రూప్ ఆపరేటివ్స్ ను అరెస్ట్ చేసింది. ఐఎస్ఐ మద్దతు కలిగిన షహజాద్ భట్టి నెట్ వర్క్ ను ధ్వంసం చేసింది. భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది. ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఆపరేషన్లు నిర్వహించింది.
ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద సంస్థ ఐఈడీలు, పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టల్లు, తూటాలు, సీసీ టీవీలు తదితర కీలక సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి" అని అమిత్ షా పేర్కొన్నారు. ఈ నెట్ వర్క్ అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం కలిగి ఉందని ఆయన వెల్లడించారు.

మరోవైపు ఈ నెట్ వర్క్ కు సంబంధించిన నియామకాలు.. ఆన్ లైన్ తీవ్రవాద ప్రచారం.. నిఘా.. లాజిస్టిక్స్.. గూఢచర్యం.. చట్టవిరుద్ధంగా ఆయుధాలు సేకరణ, స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేయడం.. అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం వంటి తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయని ఎస్ టీఎఫ్ సీనియర్ సూపరింటెండెంట్ అధికారి ప్రణవ్ కుమార్ పెగూ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications