ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!
ఏపీలో పథకాలకు బతికున్న, చనిపోయిన నేతల పేర్లు పెట్టడం చూస్తూనే ఉన్నాం. అలాగే పలు జిల్లాలకు కూడా గతంలో రాష్ట్రానికి సేవలందించిన, ప్రాణత్యాగాలు చేసిన నేతల పేర్లు పెట్టడం కూడా చూశాం. కానీ ఈసారి ఏకంగా సీఎం చంద్రబాబు పేరును ఓ జిల్లాకు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు. దీని వెనుక కీలక కారణాలే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందీ అన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో తాజాగా జిల్లాల పునర్విభజన జరిగింది. ఇందులో భాగంగా పోలవరంతో పాటు మార్కాపురం జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు జిల్లాల కోసం ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ రెండు జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇందులో మార్కాపురం జిల్లా ఏర్పాటులో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించినందున, తమ జిల్లాకు ఆయన పేరు పెట్టాలంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

మార్కాపురం జిల్లాకు చందన్న మార్కాపురం (Chandranna markapuram district) జిల్లాగా నామకరణం చేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. తన కోరిక మేరకు అసెంబ్లీలో మార్కాపురం జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు మారుస్తూ ఉమ్మడిగా ఓ తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ ను కందుల కోరారు. ఇది మార్కాపురం ప్రజల కోరిక అని ఆయన స్పీకర్ కు తెలిపారు. దీంతో స్పీకర్ ఇప్పుడు ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా, తీసుకెళ్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















Click it and Unblock the Notifications