ఓవర్ స్పీడ్- మార్కాపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
మార్కాపురం జిల్లాలో హృదయవిదారకమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం కంభం ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
మృతిచెందిన వారిని గిద్దలూరు నల్లబండ బజార్ నివాసితులుగా గుర్తించారు. వారిలో ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నగేష్ (17) లతో పాటు రెండేళ్ల వయస్సు ఉన్న ఆవుల నాగేశ్వరి ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. గిద్దలూరులో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

నల్లబండ బజార్ కు చెందిన ఆవుల వీరక్కకు కంభంకు చెందిన పాములేటితో ఈ ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. దీనికి ముందు సంప్రదాయం ప్రకారం వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో పూజలు నిర్వహించి వాళ్లంతా ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు. అదే సమయంలో లారీ అదుపుతప్పి ఆటోపైకి దూసుకెళ్లింది. దీంతో అలకనంద, అంకాలు, నగేష్, నాగేశ్వరి అక్కడికక్కడే మరణించారు. పెళ్లికూతురు ఆవుల వీరక్కతో పాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ వేగానికి ఆటో మొత్తం కూడా నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న వెంటనే మార్కాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. నుజ్జునుజ్జు అయినఆటోలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులు, మృతదేహాలను బయటికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడ్డ వారిని కంభం ఆసుపత్రికి పంపించారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగమే ఈ విషాదకర సంఘటనకు దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తోన్నారు.
రహదారులపై ప్రయాణించే వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ప్రమాదంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా జరగాల్సిన వివాహ వేడుక కన్నీటి సంద్రంగా మారింది. ఇరు కుటుంబాలు, బంధువులు విషాదంలో మునిగారు.












Click it and Unblock the Notifications