2027 డిసెంబర్ నాటికి ఉస్మానియా, వరంగల్ ఆస్పత్రులు పూర్తి చేస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్ లోని సనత్ నగర్ లో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సుమారు రూ. 1,126 కోట్ల భారీ వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. ప్రారంభ దశలో భాగంగా ప్రతిరోజూ సుమారు 300 మంది రోగులకు బాహ్య రోగుల సేవలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది. మన బిడ్డలను ప్రపంచంలోనే గొప్ప స్థానాల్లో చూడాలని నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నాం. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, జపాన్ దేశాల్లోనూ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈరోజుల్లో ప్రైవేటు వైద్యం అత్యంత ఖరీదుగా మారింది. అందుకే పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టిమ్స్ ను ప్రారంభించుకున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కోసం రూ.2,700 కోట్లు ఖర్చు చేశాం. సీఎంఆర్ ఎఫ్ కోసం రూ. 2,526 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పటి వరకు రూ. 5226 కోట్లు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేశాం. రెండేళ్లలో రూ.21,800 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ కోసం ఖర్చు చేశాం. ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరితే పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ప్రయత్నించలేదు. టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ ఆసుపత్రికి కేవలం టెంకాయకొట్టి వదిలేశారు" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"మేం అధికారంలోకి వచ్చాక సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ ఆసుపత్రులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ పూర్తయితే 10 వేల పడకల ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి. 2027, డిసెంబర్ 9 వరకు ఉస్మానియా, ఎల్బీ నగర్, అల్వాల్, వరంగల్ ఆసుపత్రులను పూర్తి చేస్తాం. ఒక్కో ఆసుపత్రికి ఒక్కో డైరెక్టర్ ను నియమించి పర్యవేక్షిస్తాం. కార్పొరేట్ తరహాలో ఆసుపత్రుల నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.
ఆసుపత్రికి వచ్చే రోగుల అటెండెంట్ లు ఉండేదుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా సమయాన్ని కేటాయించే సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ప్రోత్సహకాలను అందిచేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నా. పేదలకు వైద్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం ఉంది.. మా రేవంతన్న ఉన్నాడు అనేలా ప్రజలకు నమ్మకం కలిగించండి. మేం టిమ్స్ ను ప్రారంభిస్తామని చెప్పగానే కొందరు పగటి వేషగాళ్లల్లా వచ్చి తిరిగి పోతున్నారు.. అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేటీఆర్ వచ్చి ఇది తామే కట్టామని చెప్పి వెళ్లారు. వెనక ఉన్న మెంటల్ హాస్పిటల్ కు వెళ్లి పేషంట్లకు టిమ్స్ లు కట్టింది నేనే నన్ను గుర్తుపట్టలేదా అని కేటీఆర్ అడిగాడట.. అక్కడ ఉన్న రోగి ఊకో బిడ్డా నేను కూడా మొదట్లో అలాగే మాట్లాడేవాడిని.. రాను రాను వాడే తగ్గిపోతది అని చెప్పాడట.. మీరు కడితే పదేళ్లలో ప్రారంభించడానికి సమయం దొరకలేదా..? మీ కుటుంబమే అధికారంలో ఉన్నపుడు ఎందుకు రిబ్బన్ కట్ చేయలేదు..? అని ప్రశ్నించారు.

మీరు ఎర్రవెల్లి, జన్వాడ, మొయినాబాద్, శంకర్ పల్లి ఫామ్ హౌసులు నిర్మించుకునేందుకు ఒక్క క్షణం కూడా ఆలస్యం కానివ్వలేదు. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రులు పూర్తి చేయాలని ఆలోచన రాలేదా..? ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. నియోజకవర్గానికి 10, 20 కోట్లు ఖర్చు చేసి సేవ చేస్తే మీ పాపాలు కొంతైనా తగ్గుతాయి. కానీ అబద్ధపు ప్రచారాలతో ఏదో చేయాలనుకుంటే ప్రజలు నమ్మరు. కేసీఆర్, కేటీఆర్ 2034 వరకు మారకూడదని, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లు అబద్ధాలు చెప్పడం మాననంత కాలం నేను ఇలాగే నిజాలు చెబుతూనే ఉంటా.. అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications