Jurala చరిత్రలోనే తొలిసారి రంగు మారిన నీరు! కృష్ణమ్మ విషమయం?
జోగులాంబ గద్వాల జిల్లాలోని జీవనాడి, ప్రసిద్ధ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ వద్ద ఇప్పుడు ఒక వింతైన, భయానక వాతావరణం నెలకొంది. ఎప్పుడూ స్వచ్ఛమైన కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడే జూరాల బ్యాక్ వాటర్.. గత నాలుగు రోజులుగా ఒక్కసారిగా డార్క్ గ్రీన్ రంగులోకి మారిపోయింది. ప్రాజెక్ట్ నిర్మించిన నాటి నుంచి నేటి వరకు తమ జీవిత కాలంలో నీళ్లు ఇలా రంగు మారడం ఎన్నడూ చూడలేదని స్థానిక మత్స్యకారులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు కృష్ణమ్మ నీళ్లకు ఏమైంది? ఉన్నట్టుండి ఈ రంగు మార్పు వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి? అన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
కేవలం నీటి రంగు మారడమే కాదు, ఆ నీటి నుంచి వస్తున్న ఘోరమైన దుర్వాసన చుట్టుపక్కల గ్రామాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జలాశయం దరిదాపుల్లోకి వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందమైన జూరాల అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఈ భరించలేని కంపు తాళలేక వచ్చిన దారినే వెనుదిరిగి పోతున్నారు. ఇక జీవనోపాధి కోసం నీట్లోకి దిగుతున్న మత్స్యకారులకు చర్మంపై దద్దుర్లు, దురదలు, విపరీతమైన అలర్జీలు వస్తుండటంతో వారు నీటిలోకి దిగడానికే గజగజ వణికిపోతున్నారు. ప్రాజెక్ట్‌లోని ప్రాణవాయువు తగ్గిపోయి ఏకంగా చేపలు కూడా ఈ నీటిలో బతకలేక తేలియాడి చనిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కర్ణాటక రసాయన వ్యర్థాలా? ఎగువ ప్రాంతాల కాలుష్యమా?
ఈ విచిత్ర విపరిణామానికి కారణమేంటనే దానిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు దాటి కర్ణాటకలోని రాయచూరు పారిశ్రామిక ప్రాంతాల నుంచి విషపూరిత రసాయన వ్యర్థాలను కృష్ణా నదిలోకి గుట్టుచప్పుడు కాకుండా వదులుతున్నారా? లేక ఎగువన కొట్టుకొచ్చిన కాలుష్యమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాయచూర్ పరిశ్రమల రసాయన వ్యర్థాలే కారణమని కొందరు ఆరోపిస్తుంటే.. డీఈ నాగేశ్వరరావు మాత్రం నదీ ప్రవాహం ఆగిపోవడం, వినాయక నిమజ్జనాల నీరు చేరడం, చుట్టుపక్కల ఉన్న చేపల చెరువుల వ్యర్థాలు కలవడం వల్లనే నీటి రంగు ఇలా మారి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
నీటి పరీక్షలకు డిమాండ్.. భగీరథ నీళ్లు సురక్షితమేనా?
తాగునీటి సరఫరాకు సంబంధించి మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని, నీళ్లు సురక్షితమేనని ధైర్యం చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల భయాలు మాత్రం తగ్గడం లేదు. సాగునీరు, తాగునీటి వ్యవస్థలపై ఈ కాలుష్య ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపై అధికారులు అధికారికంగా, శాస్త్రీయ ఆధారాలతో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులతో పాటు ప్రత్యేక వాటర్ ల్యాబ్ నిపుణుల బృందాన్ని రప్పించి సమగ్రంగా నీటి నమూనాలను పరీక్షించాలని ప్రజలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం చూపకపోతే తీవ్ర ముప్పు!
ఈ అంతుచిక్కని నీటి కాలుష్యం వల్ల ఇప్పటికే జూరాల పరిధిలోని మత్స్య సంపద దెబ్బతిని ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి శాఖ, వాటర్ గ్రిడ్ అధికారులు సంయుక్తంగా జూరాల బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టి, ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో మన తాగునీటి మూలాలు ఇలా విషతుల్యం కాకుండా ఉండాలంటే కాలుష్య కారకులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పర్యవేక్షించే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.














Click it and Unblock the Notifications
