ఢిల్లీ ఏసీపీకి ఎసరు- విత్ హెల్డ్ లో ప్రమోషన్
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 3వ తేదీన దేశ రాజధానిలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ నిర్వహించిన నిరసన సందర్భంగా మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వివేక్ భగత్‌కు ఎసరు పడింది. ఆయన పదోన్నతిని ఢిల్లీ ప్రభుత్వం విత్ హెల్డ్ లో పెట్టింది. అదనపు పోలీస్ డిప్యూటీ కమిషనర్ గా ఆయన బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది. కరెంట్ డ్యూటీ ఛార్జ్ (సీడీసీ)ని నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇదివరకు ప్రభుత్వం వివేక్ భగత్ తో సహా మరో 12 మంది అధికారులకు అదనపు డీసీపీలుగా పదోన్నతులు కల్పించింది. ఈ క్రమంలో వారిని కరెంట్ డ్యూటీ ఛార్జ్ కేటాయించింది కూడా. తాజాగా ఈ జాబితా నుంచి వివేక్ భగత్ పేరును విత్ హెల్డ్ లో పెటింది. వివేక్ భగత్ తో పాటు ప్రమోషన్ పొందిన వారిలో డాక్టర్ వికాస్ షియోకంద్, ఎ వెంకటేష్, గుర్ సేవక్ సింగ్, రేణు లత, విదుషి కౌశిక్, మను హిమాన్షు, సకారియా మిహిర్ ప్రవీణ్‌భాయ్, గరిమా తివారీ, ఆశిష్ కుమార్, మనీష్ లాడ్లా, రోహిత్ గుప్తా ఉన్నారు.

ఈ నెల 3వ తేదీన జంతర్ మంతర్ వద్ద జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఢిల్లీ పోలీసు అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఢిల్లీ పోలీసులు వారి ఫిర్యాదులను స్వీకరించి, తదుపరి విచారణ కోసం వాటిని క్రైమ్ బ్రాంచ్‌కు పంపించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫొటోలను క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తోంది.
ఈ దర్యాప్తు ముగిసేంత వరకు కూడా వివేక్ భగత్ పదోన్నతి విత్ హెల్డ్ లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. డ్యూటీ ఛార్జ్ నియామకం అనేది ఓ తాత్కాలిక ప్రక్రియ మాత్రమేనని, దీనివల్ల అదనంగా ఏసీపీలకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదని వివరించింది. అలాగే సీడీసీగా అపాయింట్ అయిన అధికారులు ఆ స్థాయి అధికారులతో సమానంగా రూల్ ఆఫ్ సర్వీస్ ఉండబోరని స్పష్టం చేసింది. పదోన్నతులు సాధారణమైనవేనని, వాటి కోసం అభ్యర్థనను ఆగస్టు 25వ తేదీ నాడే పంపినట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.














Click it and Unblock the Notifications
