టేక్మాల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి తప్ప వేరేదేమీ జరగలేదని కాంగ్రెస్ అంటే అవినీతి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పల్లి బాబుమోహన్ తీవ్ర స్ధాయిలో విమర్శించారు. టేక్మాల్ మండలం బర్దీపూర్ గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఎంతమాత్రం జరగలేదని అన్నారు. ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడిన ఘనత వైఎస్ రాజశే ఖర్‌రెడ్డికే దక్కిందంటూ ఘాటు విమర్శలు చేసారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేవలం కడప జిల్లాకే జరిగిందని తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడా అభివృద్ది జరగలేదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ హయాంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. తెలుగదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.