వైయస్ రాజీనామాకు చిరు డిమాండ్
హైదరాబాద్: టికెట్ల పంపకంలో మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి డిమాండ్ చేశారు. 109 బిసి కులాలకు కాంగ్రెసు 66 సీట్లు మాత్రమే కేటాయించారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సామాజిక న్యాయం పాటించడంలో కాంగ్రెసు విఫలమైందని ఆయన విమర్శించారు. బిసిలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెసు ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేశారని, ఆ తీర్మానాన్ని వారే ఉల్లంఘించారని ఆయన అన్నారు. తాము సామాజిక న్యాయ ఎజెండాను తీసుకోగానే బిసిలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల ఎజెండాను కాంగ్రెసు ముందుకు తెచ్చిందని, ఇప్పుడు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేశారని ఆయన అన్నారు.
చిరంజీవిని ప్రజలు నమ్మబోరని కాంగ్రెసు నాయకులు అంటున్నారని, కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏమిటో, వారి మాటలకు విశ్వసనీయత ఎంత ఉందో టికెట్ల పంపకంతో రుజువైందని ఆయన అన్నారు. తాను తిరుపతి నుంచి, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పారు. మూడో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటే నల్లగొండ నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా విజయభేరిని విజయవంతం చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని, ప్రజా విజయభేరి ద్వారా ప్రజలు ఆ సంకేతాన్ని ఇచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications