చిరు పార్టీ విషవృక్షం: పరకాల

ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని తాను ఆగ్రహంతోనో, ఆవేశంతోనో తీసుకోలేదని, ఆవేదనతో తీసుకున్నానని పరకాల ప్రభాకర్ చెప్పారు. కోపంతో నిర్ణయం తీసుకోలేదని, బాధతో తీసుకున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మార్పు తేవచ్చునని, ఇతర పార్టీలకు ప్రత్యామ్మాయాన్ని ఏర్పాటు చేయాలని భావించి తాను ప్రజారాజ్యం పార్టీలో చేరానని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు చెప్పడం వల్లనే తాను అందులో చేరానని ఆయన అన్నారు. తెలియక తప్పులు జరుగుతున్నాయేమోనని తాను అనుకున్నానని, అయితే నిజం కాదని తేలిందని, తప్పుడు నడవడిక వల్లనే తప్పులు జరుగుతున్నాయని తెలిసి వచ్చిందని ఆయన అన్నారు.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ప్రయోజనం వేరు, జరుగుతున్నది వేరని ఆయన అన్నారు. తన కుటుంబమంతా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, సమాజానికి మంచి చేయాలనే ఆలోచన గల కుటుంబమని, ప్రజారాజ్యం పార్టీ వల్ల ఆ మంచి జరుగుతుందని భావించానని, కానీ అదంతా వట్టిదేనని తేలిందని ఆయన అన్నారు. ఇంత కన్నా వివరాల్లోకి వెళ్లడం మంచిది కాదని ఆయన అన్నారు. మనం అనుకున్నట్లుగా లేదని చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందని, ఇదొక విషవృక్షమని, దాన్ని పెకలించే శక్తి తనకు లేదని, అయితే అది చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందని ఆయన అన్నారు. తాను నటించలేదని, తాను అబద్ధం చెప్పలేదని, మంచి చేయిస్తుందేమోనని నమ్మానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications