నాసిరకం పనుల వల్లే బ్రిడ్జి ప్రమాదం?
కర్నూలు: నిర్మాణంలోని నాణ్యతా లోపం వల్లే కర్నూలు-బెంగుళూర్ జాతీయ రహదారిపై కెసి కెనాల్ మీది వంతెన కూలిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కెసి కెనాల్ పై ఏడో నెంబర్ జాతీయ రహదారిలో నిర్మిస్తున్న వంతెన గురువారం మధ్యాహ్నం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ వంతెనను కెఎంసి సంస్థ కాంట్రాక్టుకు తీసుకుంది. ఈ సంస్థ పివిజి రాజు సంస్థకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. ఈ వంతెనకు పక్కనే ఉన్న మరో వంతెన కుంగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వంతెన శిథిలాల కింద నలుగురు వ్యక్తులు కూరుకుపోగా వారిలో సతీష్ అనే ఇంజనీరు మరణించినట్లు చెబుతున్నారు. మిగతావారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కూలీలు. శాంతన్న, అంజమ్మ అనే కూలీలు, రవి అనే బాలుడు వంతెన శిథిలాల్లో కూరుకుపోయారు. తమను రక్షించాలని రవి, అంజమ్మ ఆర్తనాదాలు చేస్తున్నారు. వారి ఆర్తనాదాలు బయటకు వినిపిస్తున్నాయి.
శిథిలాలను తొలగించడానికి కనీసం 4 గంటల వ్యవధి పడుతుందని నిపుణులు అంటున్నారు. శిథిలాలను తొలగించడానికి క్రేన్లను సంఘటనా స్థలానికి తీసుకొచ్చారు. దిమ్మెలను కట్ చేస్తే తప్ప శిథిలాల కింద కూరుకుపోయినవారిని బయటకు తీయలేమని అంటున్నారు. సిమెంట్ దిమ్మెలను కూడా కట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications