ఎమ్మెల్యేల కట్టడికి పార్టీల శిబిరాలు
హైదరాబాద్: రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రావచ్చుననే అంచనాలు నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గెలిచిన అభ్యర్థులను కట్టడి చేయడం ఎలా అనే మీమాంసలో పడ్డాయి. శాసనసభకు ఎన్నకయ్యే అభ్యర్థులు జారిపోకుండా తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు ముందస్తు చర్యలకు ఒడి గట్టారు. ఇతర పార్టీల నేతలు తమ అభ్యర్థులను ప్రలోభ పెట్టవచ్చునని ఎవరికి వారే భయపడుతున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఈ నెల 16వ తేదీ లోగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు చేరుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నెల 14వ తేదీ నుంచే ప్రజారాజ్యం పార్టీ క్యాంపు నిర్వహించడానికి సిద్ధపడింది. తమ పార్టీ మద్దతే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం కావచ్చునని భావిస్తున్న తరుణంలో అభ్యర్థులు జారిపోకుండా చూడడం ప్రజారాజ్యం పార్టీకి శిరోభారమే కానుంది. హైదరాబాదుకు 40 కిలో మీటర్ల దూరంలోని ఒక ఫామ్ హౌస్ ను ప్రజారాజ్యం పార్టీ అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఈ నెల 15వ తేదీనాటికి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకోవాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆదేశించారు.












Click it and Unblock the Notifications